by Suryaa Desk | Sun, Dec 29, 2024, 03:15 PM
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ను ఎదుర్కొనే దమ్ములేకనే తనపైన, కేటీఆర్‌పైన అక్రమ కేసులు పెడుతున్నారని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. నిజామాబాద్‌లో ఇవాళ జరిగిన బహిరంగసభలో ఆమె ప్రసంగించారు. అనేక ఇబ్బందులు, కష్టాలు ఎదురైనా పిడికిలి ఎత్తి, అన్నీ ఎదిరించి వచ్చానని, తాను నిప్పులాంటి నిజామాబాద్ బిడ్డనని, దేనికీ భయపడనని అన్నారు. మాది భయపడే రక్తం కాదని, భయపెట్టే రక్తమని చెప్పారు.తాము ఏ తప్పు చేయలేదని, కాబట్టి భయపడే ప్రసక్తే లేదని కవిత అన్నారు. ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ కార్యకర్తలు నిప్పు కణికల్లా బయటికి వస్తారని చెప్పారు. కేంద్రాన్ని ఎదురించి ప్రశ్నిస్తే బీజేపీ కేసులు పెడుతోందని విమర్శించారు. ఇక రాష్ట్రంలో అక్రమ కేసులపై గురించి అయితే చెప్పనవసరం లేదని, సీఎం పేరు మర్చిపోయినా.. రైతులు భూములు ఇవ్వకపోయినా కేసులు పెడుతున్నారని, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎందుకింత భయమని ప్రశ్నించారు.బరువు ఎత్తుకున్నోడు ఓపికతో ఉండాలని, సీఎం రేవంత్‌రెడ్డి దగ్గర ఆ ఓపిక లేదని కవిత విమర్శించారు. ప్రజల ఇబ్బందులను పరిష్కరించడానికే అధికారం ఇచ్చారన్న విషయాన్ని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మరిచిపోయాయని ఎద్దేవా చేశారు. తాము పోరాటం చేసి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వాళ్లమని, గట్టిగా నిలబడుతామని, ప్రజల పక్షాన పోరాటం చేస్తామని అన్నారు.