by Suryaa Desk | Sun, Dec 29, 2024, 09:31 PM
కేంద్రాన్ని ఎదిరించి ప్రశ్నిస్తే బీజేపీ కేసులు పెడుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించడం పట్ల బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్రస్థాయిలో స్పందించారు. కేటీఆర్ పై కేసుతో బీజేపీకి, ప్రధాని మోదీకి ఏం సంబంధం? అని ప్రశ్నించారు. తప్పు చేసిన వారిపై పోలీసులు కేసులు పెడతారని, కోర్టు ముందు నిలబెడతారని... ఇందులో కేంద్రం పాత్ర ఏముంటుందని అన్నారు. కేసులతో భయపెట్టాలని తాము అనుకుంటే మొదట కేసీఆర్ నే ఎత్తుకెళ్లేవాళ్లమని అన్నారు. బీఆర్ఎస్ నేతలు చచ్చిన పాముల వంటివారని, ఉనికిని చాటుకోవడానికే కేటీఆర్, కవిత, హరీశ్ రావు వంటి వారు ఎక్కడో ఓ చోట మాట్లాడుతుంటారని విమర్శించారు. కవిత ఓ మహిళ కాబట్టి సరిపోయిందని, లేకపోతే ఆమె చేసిన వ్యాఖ్యలకు తన సమాధానం మరోలా ఉండేదని రఘునందన్ రావు స్పష్టం చేశారు.మరీ అంత ఎగిరిపడొద్దు... జనాలు ఇప్పటికే ఓసారి బండకేసి కొట్టారు... ఇంకా ఎగిరిపడితే మళ్లీ బండకేసి కొడతారు అని వ్యాఖ్యానించారు. తెలంగాణకు పట్టిన దరిద్రం బీఆర్ఎస్ అని విమర్శించారు.