by Suryaa Desk | Sun, Dec 29, 2024, 06:52 PM
అప్పుల బాధతో ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. దౌల్తాబాద్ పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని సూరంపల్లి గ్రామానికి చెందిన కానుగుల రమేష్ (45) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గ్రామంలో నూతన ఇల్లు నిర్మాణం, కుటుంబం అవసరాలు, వ్యవసాయం కోసం అప్పులు చేయగా, అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులతో అప్పుడప్పుడు మనస్థాపం చెందేవాడు.
దానిలో భాగంగానే శనివారం తీవ్ర మనస్థాపం చెంది జీవితం మీద విరక్తి చెంది ఇంట్లో ఎవరులేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు విషయం పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య కానుగుల శ్యామల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీరామ్ ప్రేమ్ దీప్ తెలిపారు.