by Suryaa Desk | Sat, Jan 25, 2025, 03:07 PM
స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ యేటా రెండు సార్లు పోలీసు పతకాలను ప్రకటిస్తుందనే విషయం తెలిసిందే. దీనిలో భాగంగా రిపబ్లిక్ డేను పురస్కరించుకుని తాజాగా పోలీసు పతకాలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా మొత్తం 942 మంది ఇలా గ్యాలంట్రీ/సర్వీసు పతకాలకు ఎంపికయ్యారు. ఈ మేరకు శనివారం అవార్డుల జాబితాను ప్రకటించింది. ఇందులో 746 మందికి పోలీస్ విశిష్ట సేవా (మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్), 101 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 95 మందికి మెడల్ ఫర్ గ్యాలంట్రీ, ఇద్దరికి ప్రెసిడెంట్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ పతకాలను ప్రకటించింది. ఈ పతకాలలో తెలంగాణ నుంచి 12 మందికి పోలీస్ విశిష్ట సేవా (మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్) మెడల్స్ దక్కాయి. అలాగే తెలంగాణ నుంచి పోలీస్ కమిషనర్ విక్రమ్ సింగ్ మన్, ఎస్‌పీ మెట్టు మాణిక్ రాజ్ రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలకు ఎంపికయ్యారు. ఇక ఏపీ నుంచి చీఫ్ హెడ్ వార్డర్ కడాలి అర్జున రావు, వార్డర్ ఉండ్రాజవరపు వీరవెంకట సత్యనారాయణకు కరెక్షనల్ సర్వీస్ విభాగంలో పోలీస్ విశిష్ట సేవా పతాలకు ఎంపికయ్యారు.