by Suryaa Desk | Sat, Dec 28, 2024, 09:10 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు లేఖ రాశారు. రాష్ట్రంలో కందుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మద్దతు ధరపై రూ.400 బోనస్ ఇచ్చి కంది రైతులను ఆదుకోవాలన్నారు.తెలంగాణలో దాదాపు 6 లక్షల ఎకరాల్లో 2.5 లక్షల మెట్రిక్ టన్నుల కందులు ఉత్పత్తి అయ్యే అవకాశముందన్నారు. కందులకు మద్దతు ధరకు అదనంగా ఇస్తామని వరంగల్ రైతు డిక్లరేషన్‌లో చెప్పిన కాంగ్రెస్... అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా హామీని నెరవేర్చలేదని విమర్శించారు.కందులకు మద్దతు ధర రూ.7,550గా ఉందని, బహిరంగ మార్కెట్‌లో మాత్రం రూ.6,500 నుంచి రూ.6,800 మాత్రమే ఉందన్నారు. దీంతో రైతులు ప్రతి క్వింటాలుకు రూ.800 వరకు నష్టపోతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే కంది రైతుల విషయంలో నిర్లక్ష్యం వీడాలన్నారు. కంది కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు.