by Suryaa Desk | Tue, Nov 05, 2024, 10:32 PM
ఇటీవలే హైదరాబాద్‌లోని నందినగర్ పరిధిలో నిర్వహించిన వీక్లీ మార్కెట్‌లో మోమోస్ తిని ఓ మహిళా చనిపోగా.. సుమారు 50 మంది అస్వస్థతకు గురైన విషయం మర్చిపోక ముందే.. మరో విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. నిర్మల్ జిల్లా కేంద్రంలో.. చికెన్ బిర్యానీ తిని ఓ యువతి ప్రాణాలు వదలగా.. సుమారు 20 మంది అస్వస్థతకు గురవటం ప్రస్తుతం ఆందోళనకరంగా మారింది. బోథ్ మండల కేంద్రంలోని సెయింట్ థామస్ స్కూల్ సిబ్బంది అంతా కలిసి.. నిర్మల్‌లోని గ్రిల్ నైన్ హోటల్లో భోజనం చేశారు. కాగా.. చికెన్ బిర్యానీ తిన్న.. బైగా అనే యువతి తీవ్ర అస్వస్థతకు లోనైంది. దీంతో.. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై యువతి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదే హోటల్లో సోమవారం (నవంబర్ 04)న రాత్రి భోజనం చేసిన 20 మంది కూడా అస్వస్థతకు లోనయ్యారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా మారినట్టు తెలుస్తోంది. అయితే.. ఈ ఘటనపై అధికారులకు ఫిర్యాదు చేయగా.. వెంటనే రంగంలోకి దిగి.. ఆ హోటల్ను తనిఖీ చేసి అధికారులు సీజ్ చేశారు.
ఈ హోటల్లో మండీ బిర్యానీ తిన్న పలువురికి కూడా ఫుడ్ పాయిజన్ అయి చికిత్స పొందుతున్నారు. గ్రిల్ హోటల్లో ఆదివారం రాత్రి ఖానాపూర్కు చెందిన కొందరు యువకులతో పాటు నిర్మల్కు చెందిన అస్లాం, హుస్సేన్, షేక్ బాబా, షేక్ జాకీర్, సైఫ్ మండీ చికెన్ బిర్యానీ తిన్నారు. కాగా.. ఈ మండీ బిర్యనీ తిన్న 13 మందికి వాంతులు, విరేచనాలు కావడంతో వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరు సోమవారం మధ్యాహ్నం కోలుకోగా.. ఇంకో ఆరుగురు చికిత్స పొందుతున్నారు. చికెన్ బిర్యానీ తినడంతోనే ఫుడ్ పాయిజన్ అయినట్టు బాధితులు, వైద్య సిబ్బంది స్పష్టం చేశారు.
కోడిగుడ్డు గొంతులో ఇరుక్కుని..
మరోవైపు.. నాగర్ కర్నూల్ జిల్లాలో కోడిగుడ్డు గొంతులో ఇరుక్కుని ఓ వృద్ధులు ప్రాణాలు విడిచిన ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. బిజినేపల్లి మండలం నందివడ్డేమాన్ గ్రామానికి చెందిన తిరుపతయ్య(60) ఆదివారం (నంబర్ 3న) లింగాలలో ఉన్న తన బంధువు ఇంటికి వెళ్లాడు. అక్కడి నుంచి అప్పాయిపల్లిలో ఉన్న మరో బంధువు ఇంటికి వెళ్లేందుకు లింగాల బస్టాండ్‌కు చేరుకున్నాడు. ఆకలిగా అనిపించటంతో అక్కడే ఉన్న బజ్జీల బండి వద్ద ఎగ్ బజ్జీ కొనుకున్నాడు. అది తింటుండగా.. అనుకోకుండా గుడ్డు గొంతులో ఇరుక్కోవటంతో.. ఊపిరాడక తిరుపతయ్య అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు.