by Suryaa Desk | Sat, Nov 02, 2024, 06:02 PM
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పది నెలల కాలంలో ఎంతో చేశామని ప్రధాని నరేంద్రమోదీకి సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ఈ ట్వీట్‌పై బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు కూడా ముఖ్యమంత్రి స్పందించారు. "ఇవి నిజం కాదా" అంటూ బీఆర్ఎస్ హయాంలో ఇవి చేశామంటూ అభివృద్ధి, సంక్షేమ పనులకు సంబంధించి పలు అంశాలను పొందుపరిచారు.బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో 1,61,000 నియామకాలు చేపట్టిందన్నారు. కానీ నియామకాలపై మీరు (రేవంత్ రెడ్డి, కాంగ్రెస్) అసత్య ప్రచారం చేయడం దారుణమని పేర్కొన్నారు. మీరు (సీఎంను ఉద్దేశించి) 50 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారని, కానీ వాటికి నోటిఫికేషన్లు ఇచ్చింది... పరీక్షలు నిర్వహించింది... సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసింది కేసీఆర్ హయాంలో అని వెల్లడించారు.అయితే ఎన్నికల కోడ్ కారణంగా పెండింగ్ పడిన అపాయింట్మెంట్ ఆర్డర్లను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ, తామే నియామకాలు చేపట్టినట్లు చెప్పడం విడ్డూరమన్నారు. ఉద్యోగాలు ఇస్తున్నామని కేవలం తెలంగాణనే కాదు... యావత్ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.