by Suryaa Desk | Sat, Nov 02, 2024, 07:01 PM
హైదరాబాద్ వాసులకు సౌకర్యవంతమైన ప్రయాణ సేవలు అందిస్తోన్న మెట్రో.. ఇప్పుడు మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే.. హైదరాబాద్ మెట్రో రెండో దశ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే మెట్రో రెండో దశ విస్తరణకు డిజైన్లు, ప్రణాళికలు సిద్ధం చేయగా.. అంచనావ్యయంపై అధికారులు ఫైనల్ రిపోర్టు సిద్ధం చేశారు. ఆ ఫైనల్ రిపోర్టుకు ఆమోదం తెలిపిన రేవంత్ రెడ్డి సర్కార్.. హైదరాబాద్ మెట్రో రెండో దశకు పరిపాలనా అనుమతులు జారీ చేసింది. రెండో దశ మెట్రో నిర్మాణానికి రూ.24,269 కోట్ల అంచనాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు.. జీవో 196ను రేవంత్ రెడ్డి సర్కార్ జారీ చేసింది.
అయితే.. ప్రస్తుతం నగరంలో కొత్తగా 5 మార్గాల్లో మెట్రో రెండో దశ పనులు చేపట్టనున్నారు. మొత్తం 8 కారిడార్లలో.. 76.4 కిలోమీటర్ల మేర మెట్రో రెండో దశ విస్తరణ చేపట్టనున్నారు. కారిడార్-4లో నాగోల్ నుంచి శంషాబాద్, కారిడార్-5లో రాయదుర్గం నుంచి కోకాపేట్, కారిడార్ 6లో ఓల్డ్‌సిటీ ఎంజీబీఎస్ నుంచి చాంద్రయణగుట్ట, కారిడార్-7లో మియాపూర్ నుంచి పటాన్ చెరు, కారిడార్-8లో ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్, కారిడార్-9లో ఎయిర్‌పోర్టు నుంచి ఫోర్త్ సిటీ వరకు మెట్రో మార్గాలను నిర్మించనున్నారు.
అయితే.. ఈ రెండో దశ మెట్రో విస్తరణకు మొత్తంగా రూ. 23,269 కోట్లు ఖర్చవనున్నట్టు అధికారులు అంచనా వేయగా.. ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే.. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ. 7,333 కోట్లు (30 శాతం) ఖర్చు చేయనుండగా.. కేంద్రం నుంచి రూ. 4,230 కోట్లు (18 శాతం) ఆశిస్తోంది. ఇక.. అప్పుగా రూ. 11,693 కోట్లు (48 శాతం), ప్రైవేట్ సంస్థల నుంచి రూ.1,033 కోట్లు (4 శాతం) సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
అయితే.. ఈ రెండో దశ మెట్రో విస్తరణ పనులను నాలుగేళ్లలో పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేసింది. మొదటగా.. రాష్ట్ర ప్రభుత్వం ఆరు కారిడార్లలో మొత్తం 116.4 కిలోమీటర్ల మేర మెట్రో రైలు మార్గాన్ని నిర్మించాలని భావించింది. కాగా.. ఇప్పటి వరకు ఐదు కారిడార్‌లకు సంబంధించిన డీపీఆర్ సిద్ధమైంది. అయితే.. మొదటి దశలో గత ప్రభుత్వం రూ.22,000 కోట్లతో పీపీపీ మోడల్‌లో 3 కారిడార్లలో 69 కిలోమీటర్ల మేర మెట్రో మార్గాన్ని నిర్మించాయి. ఈ మూడా కారిడార్లలో ప్రస్తుతం రోజూ సుమారు 5 లక్షల మంది ప్రయాణికులు మెట్రోను వినియోగిస్తున్నట్టు సమాచారం. ఇక.. రెండో దశ పూర్తయితే అదనంగా.. రోజుకు 8 లక్షల మంది ప్రయాణికులు మెట్రోను ఉపయోగించుకునే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.